మరో 43 యాప్‌లపై కేంద్రం నిషేధం
సరిహద్దుల్లో ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ చైనాకు కేంద్ర ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది.. ఆ దేశానికి చెందిన 43 యాప్‌లపై నిషేధం విధించింది. భారత సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో వాటిపై కొరడా ఝులిపించినట్లు అధికార ప్రకటనలో వెల్లడించింది. తాజాగా నిషేధానికి గురైన యాప్‌లలో అలీబాబా గ్రూపునకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ సహా వుయ్డేట్, చైనీస్ సోషల్, చైనా లవ్ వంటి పలు డేటింగ్ యాప్‌లు కూడా ఉన్నాయి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం నుంచి అందిన సమగ్ర నివేదికలను పరిశీలించిన అనంతరం చైనాకు చెందిన 43 మొబైల్ యాప్‌లను నిషేధించాలన్న తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార సాంకేతికత చట్టంలోని సెక్షన్ 69ఎ ప్రకారం వాటిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. చైనా యాప్‌లను మన దేశంలో వినియోగించకుండా నిషేధించడం ఇదే తొలిసారి కాదు. ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై ఈ ఏడాది జూన్ 29, మరో 118 యాప్‌లపై సెప్టెంబరు 2న కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.













