‘పాజిటివ్ రిపోర్ట్’ లేకపోయినా వైద్యం అందించాల్సిందే: కేంద్రం

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. కోవిడ్ రోగులు ఆస్పత్రుల్లో చేరేందుకు పాజిటివ్ అని తెలిపే రిపోర్ట్ అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకొని, చికిత్స అందజేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను కొంత మేర సడలించామని పేర్కొంది. ఏదైనా కారణాన్ని చూపుతూ రోగులకు వైద్య సేవలను నిరాకరించరాదని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. ఆక్సిజన్, అత్యవసర మందులు వంటి వాటితో సహా అన్ని వైద్య సేవలను రోగులకు అందజేయాలని పేర్కొంది. రోగి వేరొక నగరానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వైద్య సేవలను నిరాకరించరాదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏ వ్యక్తికైనా కోవిడ్ సోకినట్లు అనుమానం వచ్చినపుడు, ఆ వ్యక్తిని కోవిడ్ కేర్ సెంటర్ లేదా డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్, లేదా డెడికేటెడ్ కోవిడ్ ఆస్పత్రిలో అనుమానితుల వార్డులో ఉంచాలని తెలిపింది. రోగులను చేర్చుకోడానికి చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డులను ఆస్పత్రులు అడగకూడదని, అవసరం ప్రాదిపదికనే ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవాలని తేల్చి చెప్పింది. అన్ని ఆస్పత్రులు డిశ్చార్జ్ పాలసీని కచ్చితంగా పాటించాలని, రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకొనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని, అంతగా హాస్పిటల్ అవసరం లేని వారిని డిశ్చార్జీ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.