డీఆర్‌డీవో తయారుచేసిన ఓరల్ కరోనా డ్రగ్ కు డీసీజీఐ పచ్చజెండా!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ఈ వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మృతుల అంత్యక్రియల కోసం స్మశానాల ముందు క్యూలు కట్టారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత దేశాన్ని పట్టిపీడిస్తోంది. అయితే ఇటువంటి సమయంలో ప్రజలకు డ్రగ్ కంట్రోటర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) శుభవార్త చెప్పింది. కరోనాను నియంత్రించడం కోసం డీఆర్‌డీవో (డిఫెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ తయారు చేసిన ఓరల్ డ్రగ్(నోటి ద్వారా దీసుకునే మెడిసిన్)కు ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ మెడిసిన్ పేరు 2-డియోక్సీ-డి-గ్లూకోజ్. దీన్ని 2-డిజీ అని పిలుస్తారు. ఈ మెడిసిన్ ఉపయోగించిన కరోనా పేషెంట్లు వైరస్ నుంచి త్వరగా కోలుకున్నట్లు పరిశోధనలో తేలింది.
పొడి రూపంలో వచ్చే ఈ మెడిసిన్‌ను నీటిలో కలుపుకొని తాగాలి. ఇలా తాగితే కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాల్సిన అవసరం చాలా వేగంగా తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు. ఇది కేవలం జనరిక్ మూలకాలు, అనలాగ్ గ్లూకోజ్ కావడంతో దీని ఉత్పత్తి కూడా కష్టం కాదని డీఆర్‌డీవో తెలిపింది. ఇది శరీరంలోని వైరస్ కణాలు అభివృద్ధి చెందకుండా నియంత్రిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ప్రజలకు ఇది ఒక విధంగా దివ్వౌషధమే అవుతుందని నిపుణులు అంటున్నారు.