కాంగ్రెస్ సీనియర్లకు భారీ షాక్
పార్టీ అధిష్టానంపై ఇటీవల కొంత మంది నేతలు లేఖాస్త్రాలు సంధించిన నేపథ్యంలో సీనియర్లకు కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను తొలగించింది. ఆయనతోపాటు అంబికా సోని, మోతీలాల్ వోరా, మల్లికార్జున్ ఖర్గేలను కూడా ఏఐసీసీ పదవుల నుంచి దించేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించారు. చిదంబరం, సూర్జేవాలా, తారీక్ అన్వర్, జితేంద్రసింగ్‌లను సీడబ్ల్యూసీ రెగ్యులర్ సభ్యులుగా నియమించారు. తనకు పార్టీ వ్యవహారాల్లో సలహాల కోసం ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికాసోని, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్‌దీప్ సూర్జేవాలా ఉన్నారు. ఆజాద్ సీడబ్ల్యూసీ రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగనున్నారు.













