ఆ హక్కు దేశ ప్రజలకు లేదు..సుప్రీంకోర్టులో కేంద్రం
రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన సమాచారం తెలుసుకొనే హక్కు దేశ పౌరులకు లేదని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టం చేసింది. నిధులు ఎక్కడి నుంచి పార్టీలకు అందుతున్నాయన్న విషయాన్ని బయటికి వెల్లడించనవసరం లేదంది. సమాచారం హక్కు చట్టం కింద కూడా తెలుసుకొనే హక్కు ప్రజలకు లేదని ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రాంరంభించనుంది. విరాళమిచ్చే వ్యక్తి గోప్యతను ఈ పథకం కాపాడుతుంది. అవినీతి మరకల్లేని స్వచ్ఛమైన ధనం పార్టీలకు అందేలా, పన్ను నిబంధనలనూ పాటించేలా చేస్తుంది. రాజ్యాంగంలోని అధిక రణం 19(1)(ఐ) కింద పౌరుల హక్కులనూ ఉల్లంఘించడం లేదు. కాబట్టి సమాచార హక్కు చట్టం కింద రాజకీయ పార్టీల నిధుల మూలాలను వెల్లడించాల్సిన అవసరం లేదు అని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది.













