‘ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించి.. మాలాంటి వారిని అరెస్టు చేస్తారా..?’: ఎమ్మెల్సీ కవిత

‘ప్రజ్వల్ రేవణ్ణ వంటి దారుణాలకు పాల్పడిన వారిని దేశం దాటించి.. మాలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె కస్టడీని ఈ నెల 14వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కవిత కోర్టు హాలు నుంచి బయటకు వస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం కర్ణాటక వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు బెంగళూరులోని బసవనగుడిలో గల మాజీ ఎమ్మెలే, ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ ఇంట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తనిఖీలు కూడా నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకొంది. మరోవైపు ప్రజ్వల్ స్వదేశానికి త్వరలో తిరిగి రావొచ్చనే అంచనాల నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.