Abu Salem: అబూ సలేంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!
1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి, గ్యాంగ్‌స్టర్ అబు సలేంకు (Abu Salem) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన జైలు శిక్షా కాలం ముగిసిపోయిందని, వెంటనే తనను విడుదల చేయాలంటూ అతను దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
అబు సలేం వాదన ఏమిటి?
పోర్చుగల్ నుంచి తనను భారత్‌కు అప్పగించే సమయంలో (Extradition).. తనకు 25 ఏళ్లకు మించి శిక్ష విధించబోమని భారత ప్రభుత్వం హామీ ఇచ్చిందని సలేం (Abu Salem) తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ ఒప్పందం ప్రకారం, తాను ఇప్పటికే పాతికేళ్ల కంటే ఎక్కువ కాలం జైలులోనే గడిపానని, కాబట్టి తనను తక్షణమే విడుదల చేయాలని కోరాడు. 2002లో తనను పోర్చుగల్ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే తన శిక్షా కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అతను తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించాడు.
సుప్రీంకోర్టు ఏమంది?
అబు సలేం (Abu Salem) వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. శిక్షా కాలం గణనపై గతంలోనే స్పష్టత ఇచ్చామని గుర్తుచేసింది. 2002లో పోర్చుగల్‌లో అరెస్టయిన సమయాన్ని కాకుండా, 2005 నవంబరులో అతడిని అధికారికంగా భారత్‌కు అప్పగించినప్పటి నుంచే 25 ఏళ్ల శిక్షా కాలాన్ని లెక్కించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ లెక్కన అబు సలేం (Abu Salem) శిక్షా కాలం 2030 నాటికి మాత్రమే ముగుస్తుంది. ప్రస్తుతం అతను దాఖలు చేసిన పిటిషన్లో ఎటువంటి మెరిట్ లేదని వ్యాఖ్యానిస్తూ అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇవి కూడా చదవండి
భారత ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కానీ ఆ 25 ఏళ్ల కాలం ఎప్పటి నుంచి మొదలవుతుందనే విషయంలో ఎటువంటి సందిగ్ధత లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. శిక్షా కాలం పూర్తవడానికి ఇంకా సమయం ఉన్నందున, అబూ సలేం (Abu Salem) విడుదలకు సంబంధించిన పిటిషన్లు ఇప్పుడు అంగీకరించబోమని వెల్లడించింది.
కాగా, ముంబయి పేలుళ్ల కేసుతో పాటు బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో కూడా అబు సలేంకు (Abu Salem) యావజ్జీవ శిక్ష పడింది. అయితే పోర్చుగల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, భారత ప్రభుత్వం అతడికి మరణశిక్ష లేదా 25 ఏళ్లకు మించి శిక్ష అమలు చేయకూడదు. ఈ నిబంధన కారణంగానే అతను పదేపదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, తనను విడుదల చేయాలని కోరుతున్నాడు. తాజా తీర్పుతో అబు సలేం మరికొన్నాళ్ల పాటు జైలు గోడల మధ్యే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి













