పిల్లల మనసు గెలవాలంటే.. తల్లిదండ్రులు ఈ 4 అలవాట్లు పాటించండి
తల్లిదండ్రులు, పిల్లల మధ్య మంచి అనుబంధం కుటుంబంలో ఆనందానికి, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో అవసరం. నేటి బిజీ జీవితంలో ఉద్యోగాలు, చదువులు, మొబైల్ ఫోన్లు, ఇతర పనుల కారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరైన సమయం గడపలేకపోతున్నారు. దీంతో పిల్లలు తమ భావాలను బయటపెట్టడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే పిల్లలతో బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.
1.పిల్లల మాట వినండి

మొదటగా, పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని ఓపికగా వినడం చాలా ముఖ్యం. వారు చెప్పే విషయాలు చిన్నవిగా అనిపించినా, వారికి అవి ఎంతో ముఖ్యమైనవి. మధ్యలో అడ్డుకోకుండా, కరెక్షన్ చేయకుండా వినడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రులపై నమ్మకం కూడా బలపడుతుంది.
2.వారితో సమయం గడపండి

రోజుకు కనీసం అరగంటైనా పిల్లలతో ప్రత్యేకంగా గడపడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మొబైల్ ఫోన్ లేదా ఇతర పనులను పక్కన పెట్టి పూర్తిగా వారిపైనే దృష్టి పెట్టాలి. కలిసి ఆటలు ఆడటం, కథలు చెప్పుకోవడం లేదా బయట నడకకు వెళ్లడం వంటి చిన్న పనులు కూడా బంధాన్ని మరింత దగ్గర చేస్తాయి.
3.ప్రేమగా అర్థం చేసుకోండి

పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే కోపపడకుండా, ఎందుకు అలా జరిగిందో తెలుసుకోవాలి. అరవడం లేదా ఇతరులతో పోల్చడం కంటే, తప్పును అర్థమయ్యేలా ప్రశాంతంగా వివరించడం మంచిది. ఇలా చేస్తే పిల్లలు భయపడకుండా తమ సమస్యలను తల్లిదండ్రులతో పంచుకుంటారు.
4.అభిరుచులను ప్రోత్సహించండి

పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వారిని అభినందించడం కూడా చాలా అవసరం. చిన్న విజయాన్ని కూడా గుర్తించి ప్రశంసిస్తే, వారు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ప్రశంసలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, మంచి అలవాట్లను కూడా పెంపొందిస్తాయి.
పిల్లల అభిరుచులను గౌరవించడం కూడా మంచి సంబంధానికి కీలకం. ప్రతి పిల్లవాడికి తనకంటూ ప్రత్యేకమైన ఆసక్తులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ప్రోత్సహిస్తే, వారు స్వేచ్ఛగా తమ ప్రతిభను చూపించగలుగుతారు. తమ అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారని వారు భావిస్తారు.
ఇంట్లో ప్రేమతో కూడిన వాతావరణాన్ని సృష్టించడం కూడా చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడం, పండుగలు, ప్రత్యేక సందర్భాలను కలిసి జరుపుకోవడం వంటి అలవాట్లు పిల్లల్లో కుటుంబ విలువలను పెంచుతాయి. అలాగే తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా మంచి విలువలను చూపిస్తే పిల్లలు వాటిని సహజంగానే నేర్చుకుంటారు.







