అదే జరిగితే రష్యా పతనం తప్పదు : జెలెన్స్కీ
తమపై దండయాత్ర ప్రారంభించిన రష్యాను నిలువరించడంలో ఉక్రెయిన్ సమాజం అసమాన ధైర్యసాహసాలతో పోరాడుతోందని, ఈ యుద్ధంలో అంతిమ విజేతలం తామేనని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ విశ్వాసం వ్యక్తం చేశారు. కీవ్‌పై రష్యా దాడిని అలాగే తిప్పికొట్టామని, ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్బోస్ ప్రాంతంలో రష్యా దూకుడుగా వెడుతోందని, అయితే తిప్పికొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. రష్యా ఎంత ప్రయత్నించినా తలొగ్గబోమని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై వందరోజులు పూర్తయిన నేపథ్యంలో జలెన్‌స్కీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. యుద్ధం సుదీర్ఘకాలం సాగేలా రస్యా వ్యూహాలు రచిస్తోందని, అదే జరిగితే రష్యా పతనం తపదని, చరిత్రహీనురాలిగా నిలిచిపోతుందని అన్నారు. అమెరికా నుంచి తమకు హిమ్సార్ వంటి అత్యాధునిక రాకెట్ వ్యవస్థలు రాబోతున్నాయని, అప్పుడు తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరించారు.













