మళ్లీ పెరిగిన అక్రమ వలసలు.. మెక్సికో సరిహద్దు మూసివేత
అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో జో బైడెన్ ప్రభుత్వం మెక్సికో వైపు సరిహద్దులను మూసివేసింది. అయితే ఈ కారణంగా మానవీయ, రాజకీయ సవాళ్లు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిస్థితులను అదుపు చేయడానికి అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రి అలెజాండ్రో మేయర్కోస్ స్వయంగా అక్కడికి వెళ్లారు. మొత్తం కుటుంబంతో వచ్చిన వారిని, ఒంటరిగా వచ్చిన పురుషులను అక్కడి నుంచి తిప్పి పంపిస్తున్నామని చెప్పారు. అయితే యువకులు, ఇబ్బందులు పడుతున్న పిల్లలను మాత్రం పంపించడం లేదని తెలిపారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో కఠినంగా వ్యవహరించగా, ఆ విధానాలను సవరిస్తారన్న ప్రచారం జరగడంతో చాలా దేశాల వారు సరిహద్దులకు చేరుకున్నారు. పొరుగున ఉన్న గ్వాటెమాల, హోండురస్, ఎల్సాల్వెడార్లోని అంతర్గత గొడవల కారణంగా అక్కడ నుంచి కూడా భారీగానే వలస వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు అన్వేషిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.













