మరో 50 దేశాలకు పొంచి ఉన్నఆకలి ముప్పు
ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు పైగా వచ్చే ఏడాది మరింత పేదరికంలోకి మగ్గిపోనున్నాయి. ప్రపంచ ఆహారపథకం ఈ మేర కొత్త సర్వే నివేదికను వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేసే ఈ సంస్థకు ఈ ఏడాది నోబెల్ శాంతిపురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ చీఫ్ డేవిడ్ జేస్లీ మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజులు మరింత దుర్భరమని హెచ్చరించారు. 2020లో మొదలైన కొవిడ్ 19 విపత్తు 2021 సంవత్సరం మరింత కబళిస్తుందని ఆర్థిక వ్యవస్థలను వైరస్ మరింతగా ప్రభావితం చేయబోతోందని డేవిడ్ పేర్కొన్నారు.
కరోనా పరిస్థితుల వల్ల ఆకలి అనే మహమ్మారి కూడా గరిష్టస్థాయికి చేరుతోందని, ప్రపంచనేతలు తమ దేశాల్లో ఉద్దీపన ప్యాకేజీలు, పేదలకు ఆర్థికసాయం ప్రకటనల ద్వారా ఉన్న నిధులతో ఈ ఏడాది ఎలాగోలా నెట్టుకొచ్చారని, కానీ వచ్చే ఏడాది పరిస్థితులు మరింత దిగజారనున్నట్టు ఆయన చెప్పారు. 2021ని ఎలా ఎదుర్కొవాలన్నదే ఇప్పుడు నేతల ముందున్న కర్తవ్యమని డబ్ల్యూఎఫ్పి చైర్మన్ పేర్కొన్నారు. 2021లో ఆకలి, కరువు, వలసలు ఎదుర్కొనాల్సి ఉంటుందని, కొత్తగా 50కి పైగా దేశాలు కరువు, దివాళా దశకు చేరే ప్రమాదం ఉందని బేస్లీ వెల్లడించారు.













