రష్యా, ఉక్రెయిన్ లకు ఐరాస పిలుపు…తక్షణమే ఆపండి
తక్షణమే కాల్పులు ఆపాలని రష్యా, ఉక్రెయిన్ దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఇరు దేశాలు సంయమనం పాటించడంతో పాటు ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేలా చర్చలను ప్రారంభించాలని ఐరాస జనరల్ అసెంబ్లీ సూచించింది. రష్యా యుద్ధోన్మాదం కారణంగా ఉక్రెయిన్ల్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని అత్వవసరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా సంయమనం పాటించాలని ఐరాస సూచించింది. సమావేశం సందర్భంగా రష్యా యుద్దం కారణంగా చనిపోయిన మృతులకు సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆటోనియో గుటెరస్ ఇరు దేశాలకు పలు సూచనలు చేశారు. నానాటికి పెరిగిపోతున్న హింస ద్వారా అనేక మంది సాధారణ పౌరులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా జరిగిన దానిని పక్కనపెట్టేసి ఇరు దేశాల సైనికులు తమ స్థావరాలకు వెళ్లిపోవాలని సూచించారు. హింసతో సమస్యలకు పరిష్కారం లభించదని, శాంతితోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.













