పుతిన్ అధికారంలో ఉండగా చర్చలు జరిపే ప్రసక్తే లేదు
విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా రష్యన్ సైన్యం దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ద్వారా దేశంపై ఆధిపత్యం చేలాయించేందుకు పుతిన్ కుటిలయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్ ప్రజల్ని చీకటిలోకి నెట్టేస్తే శాంతి చర్చలు జరుగుతాయనుకోవడం అసంభవం అని తెలిపారు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడుల్లో మూడొంతుల్లో ఒక వంతు విద్యుత్ స్టేషన్లన్నీ నాశనమైపోయాయని జెలెన్స్కీ తెలిపారు. పుతిన్ అధికారంలో ఉండగా రష్యాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. రష్యా విజయానికి దాదాపు దారులన్నీ మూసుకుపోయాయని, అందువల్ల తన సైనికపరాజయాలను ఉగ్రవాద చర్యలతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.













