డొనాల్డ్ ట్రంప్ కు ట్విటర్ షాక్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇంకెప్పుడూ ట్విటర్‌లోకి అనుమతించేది లేదని ఆ సంస్థ తేల్చి చెప్పింది. జనవరి 6న అమెరికా రాజధానిలోని క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారుల హింసాత్మక దాడి నేపథ్యంలో ట్రంప్ ఖాతాను ట్విటర్ డీ ప్లాట్‌ఫామింగ్ చేయగా, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు కూడా ఆయనపై నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. ప్రజలను హింసకు పాల్పడేలా ఎవరు ప్రేరేపించినా.. వారిని తమ వేదిక నుంచి తొలగించటమే కాకుండా తిరిగి రానివ్వబోమని ట్విటర్ చీఫ్ పైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్ వెల్లడించారు.
మా ప్లాట్‌ఫాం నుంచి ఒకసారి ఒకరిని తొలగించామంటే దాని అర్థం పూర్తిగా తొలగించటమే. అది ఓ విమర్శకుడైనా, ఏదైనా కంపెనీ సీఎఫ్ఓ అయినా, ప్రస్తుతం లేదా ఇదివరకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా మా సంస్థ నియమాలు ఒకే విధంగా ఉంటాయి అని ట్వీటర్ సీఎఫ్ఓ నెడ్ సెగాల్ ఓ ముఖాముఖిలో స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా ట్రంప్‌ను ట్విటర్‌లోకి మళ్లీ అనుమతించేది లేదని ఆయన తెలిపారు.













