సత్య నాదెళ్ల పుస్తకం తెలుగులో విడుదల.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన మైక్రోసాఫ్ట్ సీఈవో
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పరిచయం అక్కర్లేని పేరు. భారత్ నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ తన ప్రతిభతో మైక్రోస్టాఫ్ట్ వంటి సంస్థలో సీఈఓ స్థాయికి ఎదిగిన సత్య నాదెళ్ల యువతకు ఎంతో స్ఫూర్తినిస్తారు. ఆయన రాసిన పుస్తకం ‘హిట్ రీఫ్రెష్’ను తాజాగా తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా పుస్తక ప్రచారం కోసం సత్య నాదెళ్ల.. రెండు రోజుల పాటు భారత పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మిక్స్డ్ రియాలిటీ, ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), క్వాంటమ్ కంప్యూటింగ్.. ఈ మూడే ప్రపంచాన్ని శాసిస్తాయని, ప్రపంచ రూపు రేఖలను మార్చేస్తాయని చెప్పారు. ఇవి మన భవిష్యత్తు రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వీటిలో మిక్స్డ్ రియాలిటీని హైబ్రీడ్ రియాలిటీ అని కూడా అంటారని, ఇది రియల్-వర్చువల్ టెక్నాలజీల కలయిక అని వివరించారు. ఇప్పటి వరకు కంప్యూటింగ్ మానవ ఆధారంగానే జరిగింది, కానీ భవిష్యత్తులో మాత్రం కంప్యూటింగ్ కూడా పూర్తిగా మిక్స్డ్ రియాలీగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇదే పుస్తకం గతేడాది నవంబర్ 26న ఇంగ్లీషులో విడుదలైంది. ఈ పుస్తకంలో సత్య తన వ్యక్తిగత జీవితంతో పాటు మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణ అనుభవాలను రాసుకొచ్చారు.













