గ్రాఫీన్ తో కరోనా గుర్తింపు…అమెరికా శాస్త్రవేత్తలు

అత్యంత పలుచని, అతి దృఢమైన పదార్థాల్లో ఒకటైన గ్రాఫీన్ కరోనా వైరస్‍ను త్వరగా, కచ్చితంగా గుర్తించడంలో ఉపయోగపడుతుందని అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. పరిశోధనలో భాగంగా తపాలా స్టాంపు మందంలో వెయ్యోవంతు పలుచగా ఉండే గ్రాఫీన్ రేకులను కొన్నింటిని అతికించారు. వాటిపై కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‍ను (కొమ్ముల వంటి భాగం) ఆకర్షించేందుకు యాంటిబాడీని ప్రయోగించారు. ఆపై కృతిమ లాలాజలంలోని కరోనా పాజిటివ్, కరోనా నెగెటివ్ నమూనాలను ఉంచి, పరమాణు స్థాయి కంపనాలను కొలిచారు. పాజిటివ్ నమూనా ఉంచినప్పుడు కంపనాల్లో మార్పు కనిపించింది. నెగెటివ్ నమూనా ఉంచినప్పుడు ఎలాంటి మార్పు లేదు.