యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం… కానీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణులు ఇస్తామని అమెరికా చెబుబోంది. మంచిదే. అలాగే కానివ్వండి. ఆ క్షిపణులను సైతం మేము కచ్చితంగా కూల్చేస్తాం అని స్పష్టం చేశారు. యుద్దానికి మరింత ప్రజ్వరిల్లజేయడానికే అమెరికా ఆయుధాలు ఇస్తాందని ఆరోపించారు. సంఘర్షణను ఇంకా పొడిగించాలన్నదే అమెరికా ఆలోచన అని దుయ్యబట్టారు. పుతిన్ తాజాగా మాస్కోలో మీడియాతో మాట్లాడారు. త్వరగా, మెరుగ్గా యుద్దాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని తేల్చి చెప్పారు. గతంలో సైనిక చర్యలన్నీ సంప్రదింపులతోనే ముగిశాయని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌లోని ఘర్షణను ప్రస్తావిస్తూ యుద్ధం అనే మాటను పుతిన్ ఉపయోగించారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ జరుగుతోంది అని ఇన్నాళ్లూ ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. తొలిసారి బహిరంగంగా యుద్దం అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగాలని జెలెన్స్కీ. అమెరికా అధికారులు కోరుకుంటున్నారని అమెరికాలో రష్యా రాయబారి ఆనతొలీ అంటోనోవ్ విమర్శించారు.













