వచ్చే వారంలో మోదీ, జో బైడెన్ భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే వారంలో కొన్ని కీలక కూటమి సమావేశాల్లో ఒకరితోనొకరు ఎక్కువ సమయం గడపనున్నారు. జీ-7 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న జపాన్, ఆహ్వానిత దేశ హోదాలో 8 దేశాలకు ఆహ్వానం పంపింది. ఇందులో భారత్ కూడా ఉంది. ఈ సదస్సులో పాల్గొనడానికి మోదీ ఈ నెల 21న హిరోషిమా బయల్దేరనున్నారు. బైడెన్ కూడా హాజరవుతారు. 22న పపువా న్యూగినియాలో పసిఫిక్ దీవుల ఫోరమ్ సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఇక్కడ అగ్రరాజ్యాధినేతతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. 24న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియాలో అడుగుపెడతారు. భారత్ సహా కూటమి సభ్యదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు ఈ కీలక సదస్సులో ఇండో` పసిఫిక్లో చైనా దూకుడు, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, తదితర అంశాలను చర్చించనున్నాయి. ఈ సందర్భంగానూ బైడెన్ను మోదీ కలుస్తారు.













