అమెరికాలో భారతీయ విద్యార్థులే టాప్
విదేశాల్లో విద్య అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రధానమైన గమ్యస్థానంగా ఉన్నది. 2021-22 విద్యా సంవత్సరంలో 1,99,182 భారతీయ విద్యార్థులు అమెరికా బాట పట్టారు. 2020-21లో ఈ సంఖ్య 1,67,582 మాత్రమే ఉండగా, తాజాగా 18.6 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఈ మేరకు అమెరికాలో విదేశీ విద్యార్థులకు సంబంధించిన ఓపెన్ డోర్స్-2022 పేరుతో రూపొందించిన నివేదికను యూఎస్ ఎంబసీ అధికారులు విడుదల చేశారు. మొత్తంగా 2020-21తో పోలిస్తే అమెరికా చదివే విదేశీ విద్యార్థుల శాతం 3.8 శాతం పెరిగింది. 2020-21 లో ఇతర దేశాలకు చెందిన 9.14 లక్షల మంది విద్యార్థులుంటే 2021-22కు 0.48 లక్షలకు చేరినట్లు ఈ నివేదిక వెల్లడించింది. విద్య కోసం అమెరికాకు వెళ్తున్న వారిలో చైనీయుల తర్వాత స్థానంలో భారతీయులు ఉన్నారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల్లో 31 శాతం చైనీయులు, 21 శాతం భారతీయులు ఉన్నారు. మొత్తంగా 52 శాతం భారత్, చైనాల నుంచే ఉండటం గమనార్హం.













