క్యాపిటల్ దాడి ఘటన కలచివేసింది : జో బైడెన్
అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద కారు దాడి ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. క్యాపిటల్ దాడిలో భద్రతా అధికారి విలియమ్ ఎవన్స్ మృతి చెందడంపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిలో మృతి చెందిన పోలీసుకు సంతాపం ప్రకటించారు. క్యాపిటల్, అక్కడ పనిచేసేవారు, దాన్ని సంరక్షించేవారికి ఇదో గడ్డుకాలమని బైడెన్ వ్యాఖ్యానించారు. దాడిపై సత్వరం స్పందించిన క్యాపిటల్ పోలీసులు, నేషనల్ గార్డ్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన అధికారికి సంతాప సూచకంగా శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 6 వరకు శ్వేతసౌధంలో జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. పోలీసు అధికారి విలియమ్ ఎవన్స్ మృతిపై యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అలాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మృతి చెందిన పోలీసుకు సంతాపం ప్రకటించారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సవాలు లాంటి ఇలాంటి సమయంలో క్యాపిటల్‌ను రక్షిస్తున్న వారిని చూసి ఎంతో గర్విస్తున్నా అని కమలా వెల్లడించారు.













