హజ్ యాత్రికులకు షాక్… ఈ ఏడాది కూడా

కరోనా మహమ్మారి కారణంగా మరోసారి హజ్ యాత్ర రద్దు చేశారు. గత ఏడాది హజ్‍యాత్రను రద్దు చేసిన ఇండోనేషియా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసింది. కొవిడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్లడించారు. సౌదీ అరేబియా సైతం హజ్‍కు ప్రవేశం కల్పించలేదని తెలిపారు. ఇది కేవలం ఇండోనేషియాకు మాత్రమే పరిమితం కాదని, ఇతర దేశాలకు కూడా ఎలాంటి కోటాలు కేటాయించలేదని అన్నారు. ఇప్పటికే హజ్ ఫీజులు చెల్లించినవారు వచ్చే ఏడాది యాత్రికులు అవుతారని తెలిపారు.
జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్రకు వెళ్లాలని ముస్లింలు భావిస్తుంటారు. కోవిడ్ కారణంగా కోటా విధానంలో సగటున 20 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా హజ్ యాత్రపై సైతం కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సుమారు 2.5 మిలియన్ల మంది యాత్రికులు ఇస్లాం పవిత్ర స్థలాలు మక్కా, మదీనాను ఏడాది పొడవునా సందర్శిస్తుంటారు. అధికారిక డేటా ప్రకారం ఆ దేశానికి 12 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది.