భారతీయ విద్యార్థులకు రష్యా ఓ ఆఫర్
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు రష్యా ఓ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు చెన్నైలోని రష్యన్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రష్యాలో ఉన్నత విద్యను చదవాలనుకునే భారత విద్యార్థులు మా యూనివర్సిటీలు అందించే స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కింద 89 ప్రాంతాల్లోని 766 రష్యన్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు 200 గ్రాంట్ల వరకు స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. జనరల్ మెడిసిన్, ఫిజిక్స్, న్యూక్లియర్ పవర్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో ఈ స్కాలర్షిప్లను ప్రకటించారు.
అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, రీసర్చ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని రష్యన్ హౌస్ తమ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం www.education-in-russia.com వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలను వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది.













