భద్రతా మండలి ఎందుకు విఫలమైంది ? : భారత్
ఉక్రెయిన్-రష్యా యుద్దాన్ని ఆపడంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎందుకు విఫలమైందో అంతర్జాతీయ సమాజం నిలదీయాలని భారత్ డిమాండ్ చేసింది. ప్రపంచంలో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత భద్రతా మండలిపై ఉందని గుర్తు చేసింది. ఉక్రెయిన్ సమస్యపై భద్రతా మండలి బహిరంగ చర్చలో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్ శర్మ ఈ సందర్భంగా రెండు ప్రశ్నలను లేవనెత్తారు. ఉక్రెయిన్ యుద్దానికి పరిష్కారం కనుచూపు మేరలో ఉందా? పరిష్కారం కనబడటం లేదంటే భద్రతా మండలి విధి నిర్వహణలో విఫలమైనట్లు కాదా? అంటూ సంజయ్ ప్రశ్నించారు. మండలిని సంస్కరించనంతవరకు దానిపై పూరిస్థాయి వివ్వసనీయత ఏర్పడదని శర్మ ఉద్ఘాటించారు. మండలిలో భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్యత్వం కోరుతున్నాయి. ఆ మేరకు సంస్కరణలు తీసుకురావడం తప్పనిసరని డిమాండ్ చేస్తున్నాయి.













