కరోనా వల్ల భారత్ తీవ్రంగా దెబ్బతింది : ట్రంప్

కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తీవ్రంగా దెబ్బతిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తికి కారణమైనందుకు 10 లక్షల కోట్ల డాలర్ల పరిహారాన్ని అమెరికాకు చైనా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి అంతకంటే ఎక్కువ మొత్తాన్నే డ్రాగన్ చెల్లించాలని అభిప్రాయపడ్డారు. అయితే, మరింత ఎక్కువ సొమ్మును చెల్లించగల సామర్థ్యం లేదు కాబట్టి కేవలం 10 లక్షల కోట్ల డాలర్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కొవిడ్ దెబ్బకు కుదేలయ్యాయని పేర్కొన్నారు.