ఓటు హక్కుపై ప్రవాసీల అనాసక్తి.. స్వదేశానికి రావడానికి నిరాకరణ..
దుబాయ్: భారతదేశంలో ఎన్నికల హడావిడి మొదలవుతోంది. దేశ రాజకీయాల్లో కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య వివిధ దఫాలలో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారత ప్రవాసులు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదని తెలుస్తోంది. దీనికి కారణం కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఉన్న ఆంక్షలే అని సమాచారం. అందుకే చాలా మంది ప్రవాసులు స్వదేశానికి వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయా దేశాల్లోని సామాజిక సంస్థలు, భారత రాజకీయ పార్టీల ప్రతినిధులు చెప్తున్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఆసక్తి ఉన్న వారు రిజిస్టర్ చేసుకోవాలని గతవారం కోరగా.. చాలా మంది స్వదేశానికి వెళ్లి ఓటువేసేందుకు వెనుకాడుతున్నారని, కొవిడ్ నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు ఉండటమే దీనికి కారణమని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్(కేఎంసీసీ) దుబాయ్ విభాగం కార్యదర్శి, లీగల్ సెంటర్ చైర్మన్ ఇబ్రహీం ఖలీల్ పేర్కొన్నారు. కాగా, గత జనరల్ ఎన్నికల సమయంలో ఓటర్లను స్వదేశానికి తరలించడానికి ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఖలీల్ తెలిపారు.
దుబాయ్ నుంచి 150 మందే..
అటు దుబాయ్‌లోని ఇండియన్ పీపుల్స్ ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ మన్నాథ్ మాట్లాడుతూ ఓ 150 మంది ప్రవాసులు మాత్రం స్వదేశానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అది కూడా వారి సొంత ఖర్చులతో విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధికులు కేరళలోని పాలక్కాడ్, తిరువనంతపురం, త్రిశూర్, మలంపూజ నియోజకవర్గాలకు చెందిన వారని రమేష్ తెలిపారు. అయితే, చాలా మంది క్వారంటైన్ నిబంధనల కారణంగా భారత్‌కు రావడానికి నిరాకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోస్టల్ ఓటింగ్ ఆశలు..
ఈ ఎన్నికల నాటికి పోస్టల్ ఓటింగ్ విధానం అందుబాటులోకి వస్తుందని చాలా మంది ఎన్నారైలు భావించారు. కానీ అలా జరగలేదు. దీనికి మరికొంత సమయం పడుతుందుని భారత ఎన్నికల కమీషన్ వెల్లడించింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్నారైలకు రిమోట్ ఓటింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.













