భారత పర్యటనలో ఎఫ్బీఐ చీఫ్
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ భారత పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ఉద్దేవమనిన చెప్పారు. అయితే సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నాడంటూ అమెరికా ఆరోపణల నేపథ్యంలో ఎఫ్బీఐ చీఫ్ క్రిస్టోఫర్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ దినకర్ గుప్తాతో క్రిస్టోఫర్ సమావేశం అయ్యారు. ఈ ఏడాది మార్చిలో ఖలిస్థానీ మద్దుతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయంపై జరిపిన దాడి గురించి చర్చించారు. త్వరలో దర్యాప్తునకు అవసరమయ్యే కీలక సమచారాన్ని అందిస్తామని క్రిస్టోఫర్ హామీ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత ఆగస్టులో ఎన్ఐఏ బృందం కూడా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లింది. కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించింది. వ్యవస్థీకృత నేరగాళ్లు , ఉగ్రవాదులు, వారిమధ్య సంబంధాల గురించి ఈ సమావేశంలో ఎన్ఐఏ చీఫ్ ప్రస్తావించారు. అలాగే పెండిరగ్లో ఉన్న అప్పగింతల గురించి వారు మాట్లాడుకున్నారు. దీనిలో భాగంగా 26/11 ముంబయి దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్ రాణా (62) అప్పగింత అంశం చర్చకు వచ్చిందని అధికారులు తెలిపారు.













