చైనా పండుగకు కరోనా కాటు
బీజింగ్ః రెండవ విడత కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి చైనా ప్రభుత్వం కనీ వినీ ఎరుగని చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఏటా ఎంతో వేడుకగా, వైభవంగా జరుపుకునే చైనా ‘సంవత్సరాది’ పండుగను అది రద్దు చేసింది. చైనా భాషలో ఈ పర్వదినాన్ని ‘చుంజీ’ అని వ్యవహరిస్తారు. చైనా ప్రజలు అతి వైభవంగా జరుపుకునే ఏకైక అతి పెద్ద పండుగ ఇది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 12న జరగాల్సిన ఈ పర్వదిన వేడుకలను అది కరోనా భయంతో రద్దు చేయాల్సి వచ్చింది. ‘స్ప్రింగ్ ఫెస్టివల్’ పేరుతో వసంత రుతువులో చైనా ప్రజలు చాంద్రమానం ప్రకారం జరుపుకునే ఈ పండుగ నిరుడు కూడా కరోనా భయంతోనే రద్దయింది. ప్రజలు ఎవరి ఇళ్లలో వారు ప్రశాంతంగా జరుపుకోవడం తప్ప, ఈ సామాజిక పర్వదినాన్ని ఈసారి వీధుల్లో జరుపుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రెండవ విడత కరోనా కారణంగా ఈ నెలలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ వైరస్ విషయంలో ఇక రిస్కు తీసుకోలేమని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. శ్వాస ద్వారా వ్యాప్తి చెందే ఈ రెండవ కరోనా మరీ ప్రాణాంతకమయిందని, పండుగను సామాజికంగా జరుపుకోవడం వల్ల వేలాది మందికి సోకే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దేశంలో ఇప్పుడు ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ లాంటి పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇది చాలా ప్రాణాంతకమైన వైరస్ అని, ఒక్క చైనాయే కాక, ప్రపంచ దేశాలన్నీ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయని హెచ్చరించింది.
వలస జీవులపై ఆంక్షలు
భారతదేశంలో సంక్రాంతి, దీపావళి, దసరా పర్వదినాల మాదిరిగానే, చైనాలో కూడా కొత్త సంవత్సరాది జరుపుకోవడానికి లక్షలాది మంది తమ స్వస్థలాలకు బయలుదేరి వెళతారు. ఇతర దేశాల్లో ఉన్న చైనీయులు కూడా స్వదేశానికి, స్వస్థలానికి వెళ్లడానికి తాపత్రయపడతారు. లక్షల సంఖ్యలో జరిగే ఈ ‘వలసల’ను నివారించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. పండుగ వేడుకలపై నిషేధం విధించిన చైనా ప్రభుత్వం వూహాన్, షాంఘైతో సహా నాలుగు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ ప్రకటించింది. ఫిబ్రవరి 12 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఈ పర్వదిన వేడుకలను ఈ ఏడాది కూడా ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, ఇళ్లకు కూడా బంధుమిత్రులను ఆహ్వానించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ పర్వదినం జరుపుకోవడానికి సుమారు 30 కోట్ల మంది స్వస్థలాలకు ప్రయాణమవుతారని అంచనా. అత్యవసరమయితే తప్ప ఫిబ్రవరిలో ఎవరూ ఎక్కడికీ ప్రయాణం చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా ప్రయాణిస్తే వారిని రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచడం జరుగుతుందని గట్టిగా హెచ్చరించింది.
ఫిబ్రవరి 12న వచ్చే కొత్త సంవత్సరాదితో చైనాలో ‘వృషభ’నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరాది పండుగ దాదాపు సంక్రాంతిని తలపిస్తుంది. దేశంలోని హిందూ, బౌద్ధ ఆలయాలను అద్భుతంగా అలంకరిస్తారు. పూజలు చేయడానికి వచ్చే జనంతో ఆలయాలు కిటకిటలాడిపోతాయి. అనేక ప్రాంతాలలో దేవుడి విగ్రహాలను ఊరేగించడం జరుగుతుంది. వీధులను, ముఖ్యమైన కూడలి ప్రాంతాలను, పర్యాటక ప్రాంతాలను, వాణిజ్య కేంద్రాలను, వ్యాపార సంస్థలను, మార్కెట్లను పూలతో, రంగుల కాగితాలతో, బలూన్లతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. వీధుల్లో ముగ్గులు దర్శనమిస్తాయి. ప్రజలంతా కొత్త దుస్తులు ధరిస్తారు. ఇళ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు. మిఠాయిలు పంచుకుంటారు. నగరాలు, పట్టణాలు, పల్లెలన్నీ బాణసంచా మోతలతో మార్మోగిపోతాయి. వరుసగా మూడు రోజుల పాటు బాణసంచా కాలుస్తూనే ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే, గత ఏడాది, ఈ ఏడాది బాణసంచా పేలుడును పూర్తిగా నిషేధించడం ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది.
తీవ్ర నిరుత్సాహం
కాగా, గత ఏడాది ఈ పర్వదిన వేడుకలను నిషేధించినప్పుడు సర్దుకుపోయిన ప్రజలలో ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. చాలా రోజుల నుంచి ఈ పర్వదినం కోసం ఎదురు చూస్తూ, ఎన్నో కలలు గంటున్న ప్రజానీకం ప్రభుత్వం ఆంక్షలు విధించినా, నిషేధాలు అమలు చేసినా తాము ఈ పర్వదినాన్ని బంధుమిత్రులతో జరుపుకునే తీరుతామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం ప్రారంభించడంతో ఆరోగ్య శాఖ అధికారులు, ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది రెండవ విడత కరోనా ప్రమాదం గురించి ప్రజలకు విడమరచి చెప్పడం ప్రారంభించారు. బీజింగ్, షాంఘై వంటి నగరాలలో సైతం ప్రజలకు అధికారులు నచ్చజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పర్వదినం విషయంలో ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని గమనించిన ప్రభుత్వ పెద్దలు ప్రజలను తృప్తి పరచడానికి, శాంతింపజేయడానికి కొన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఏడాదికి ఇళ్లలోనే కూర్చుని ఈ పండుగ జరుపుకునే ‘వలస’ ప్రజలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇళ్లకు ఉచితంగా దుస్తుల సరఫరా, మిఠాయిల సరఫరా చేపట్టబోతున్నారు. ఇళ్లను పువ్వులతో, రంగు కాగితాలలో అలంకరించే బాధ్యతను కూడా వారు తమ తలకెత్తుకున్నారు. పుష్పగుచ్ఛాలు అందజేయబోతున్నారు. ఉచితంగా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు కూడా అవకాశమిచ్చారు. ఎంత చేసినప్పటికీ, ప్రజల్లో, ముఖ్యంగా వలస జీవుల్లో నిరుత్సాహం తగ్గడం లేదు. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ ఇది తీవ్రస్థాయిలో బయటపడే అవకాశం ఉంది.













