వీసా నిబంధనలు కఠినతరం : ఆస్ట్రేలియా
విద్య, ఉపాధి అవకాశాల కోసం తమ దేశానికి వలసలు పెరిగిపోవడంపై ఆందోళన చెందుతున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటిని భారీగా తగ్గించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విద్యార్థులు, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీసా నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా వచ్చే రెండేళ్లలో వలసలను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వలసల సంఖ్య రికార్డు స్థాయిలో 5,10,000గా నమోదైంది. వీరిలో అత్యధికులు అంతర్జాతీయ విద్యార్థులేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఖ్యను రెండేళ్లలో 50 శాతానికి ( 2.5 లక్షలకు) తగ్గించలేకపోతే మరిన్ని కఠిన నిబంధనలు విధించే యోచనలో ఉంది. ఇది కొవిడ్‌కు ముందున్న స్థాయికి సమానం. అంతర్జాతీయ విద్యార్థులు ఇంగ్లిష్ నైపుణ్య పరీక్షల్లో అధిక రేటింగ్ పొందాల్సి ఉంటుంది. దీంతో పాటు వసతికి సంబంధించి విద్యార్థి దరఖాస్తును ఆస్ట్రేలియా మరింత నిశితంగా పరిశీలించనుంది. తాజా నిర్ణయాలు ఆ దేశానికే వెళ్లే యత్నంలో ఉన్న భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.













