మాజీ డీజీపీ ప్రసాదరావు ఇక లేరు …

ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీగా సేవలందించిన ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ బి.ప్రసాదరావు అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. గత రాత్రి ప్రసాదరావుకు గుండెనొప్పి రావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రసాదరావు స్వస్థలం ఆంధప్రదేశ్‍లోని విజయవాడ. 1979 ఐపీఎస్ బ్యాచ్‍కు చెందిన ప్రసాదరావు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఏసీబీ డీజీగా, విశాఖ ఎప్పీ, హైదరాబాద్ కమిషనర్‍గా, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగానూ సేవలందించారు. ఆయన సేవలకు గాను 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు. డీజీడీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్‍ఛార్జీ డీజీపీగా ఆయన వ్యవహరించారు. ఆయన వర్డ్ పవర్ టు మైండ్ పవర్ అనే పుస్తకం రాశారు.
ప్రసాదరావు మరణ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రసాదరావు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.