కేంద్రం, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్..!

రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి గ్యాప్ తలెత్తింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలకు వ్యాక్సిన్ తక్కువగా పంపుతోందని ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని.. అందరినీ సమానంగానే చూస్తున్నామని కేంద్రం చెప్తోంది. వ్యాక్సిన్ అందుకున్న టాప్ 3 రాష్ట్రాల్లో రెండు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలేనని క్లారిటీ ఇచ్చింది. అయినే కేంద్రంపై విమర్శ వాన మాత్రం తగ్గట్లేదు. చాలా రాష్ట్రాలు తమకు వ్యాక్సిన్ అందట్లేదని.. డిమాండ్ కు తగ్గ సప్లై లేదని దుయ్యబడుతున్నాయి.
టీకాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ పేరెన్నికగన్నది. మన దేశంలో రెండు రకాల కరోనా టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. బ్రిటన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా టీకాను పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ఇకే దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశంలో పూర్తిస్థాయిలో అనుమతులు పొందిన టీకాలు ఈ రెండే. అయితే వీటని అవసరాలకు తగినంత మేర సప్లై చేయట్లేదని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కరోనా సెకెండ్ వేవ్ దేశాన్ని ఊపేస్తోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొదటి వేవ్ తో పోల్చితే ఇప్పుడు గరిష్ట కేసులు రికార్డవుతున్నాయి. కేసులు కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్నాళ్లూ వ్యాక్సినే వేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు కూడా .. ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో టీకా కోసం ముందుకొస్తున్నారు. దీంతో వ్యాక్సిన్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఆయా రాష్ట్రాలు కూడా కేసుల నుంచి గట్టెక్కేందుకు వీలైనన్ని టీకాలు వేసేందుకు సుముఖంగా ఉన్నాయి. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే వయసు నిబంధన తొలగించాలని పలు రాష్ట్రాలు సూచిస్తున్నాయి. అందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే 45 ఏళ్లు పైబడిన వారికే ఇప్పుడు టీకాలు సరిపోవట్లేదు. ఇక అందరికీ టీకా అందించడం ఇప్పట్లో అసాధ్యం.
ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్ లలో కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతివ్వాలని ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని.. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కేసుల కట్టడికి నైట్ కర్ఫ్యూ మాత్రమే ప్రత్యామ్నాయం అని తేల్చేశారు. లాక్ డౌన్ పెట్టే ఆలోచన కూడా లేదని చెప్పేశారు. అయితే టీకాలు లేకపోవడంతో వ్యాక్సినేషన్ సెంటర్లు మూసేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని మహారాష్ట్ర, పంజాబ్ చెప్తున్నాయి. ఒడిశా కూడా తమకు సరిపడా టీకాలు సప్లై కావట్లేదని ఆరోపించింది. మరోవైపు దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
అయితే.. వ్యాక్సిన్ కొరత లేదని.. రాష్ట్రాల అవసరాలకు తగినంతా సప్లై చేస్తున్నామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ 8.4 కోట్ల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేసినట్లు చెప్తోంది. అంతేకాక.. టీకా నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటోంది. అయితే పంపించిన వ్యాక్సిన్లలో వృథా తగ్గించాలని.. చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ ను వేస్ట్ చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లన్నింటినీ మనమే వాడుకునే అవకాశం లేదన్న ఆరోగ్య మంత్రి.. ఒప్పందాల మేరకు పలు ఇతర దేశాలకూ పంపిస్తున్నామన్నారు. అలాగని మన దేశీయ అవసరాలను పక్కన పెట్టట్లేదని స్పష్టం చేశారు. మన అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు పంపిస్తున్నామన్నారు. రాష్ట్రాలు అడిగితే మరిన్ని డోసుల పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.