విదేశాలకు వెళ్లే విద్యార్థులకు… వ్యాక్సిన్

విదేశాల్లో చదువు కోసం వెళ్లాలనుకున్న విద్యార్థులకు వ్యాక్సిన్ కొరత సమస్యగా మారింది. ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాలకు ఏటా సుమారు మూడు లక్షల మంది వెళ్తారు. వీరిలో 60 శాతం మంది ఆగస్టు, సెప్టెంబరు సమయంలో వెళ్తారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకుంటేనే దేశంలోకి అనుమతిస్తామని పలు దేశాలు షరతులు విధించాయి. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని సామాజిక వేత్త ఎన్.వెంకటరెడ్డి ఆంధప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇప్పటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తేనే ఆగస్టు నాటికి రెండో డోస్ వ్యాక్సిన్ విద్యార్థులకు వేయగలరని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలని కోరారు. విదేశాల నుంచి ఆడ్మిషన్ పత్రాలు చూపించిన విద్యార్థులకు వ్యాక్సిన్ అందించాలన్నారు.