ఇకపై టీకా మీవద్దకే.. అంతటి సౌలభ్యం కలిపించిన కేంద్రం

ఇకపై కరోనా వ్యాక్సిన్ కోసం ఆస్పత్రులకు మాత్రమే వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ పని ప్రదేశాల్లోనే టీకా వేయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే ఆయా పని ప్రదేశాల్లో కనీసం 100 మంది ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా 100 మంది సిద్ధంగా ఉంటే కార్యాలయాల్లో టీకా వేయవచ్చు.
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేస్తోంది కేంద్రం. దీని ద్వారా కరోనాపై పోరును మరింత ఉధృతం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తులు కూడా చేస్తోంది. ముఖ్యంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీకాలు వేసే వయోపరిమితిని కూడా పెంచాలని రాష్ట్రాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మ్యానుఫ్యాక్చరింగ యూనిట్లు, సేవా రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీరందరికీ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావడానికే ఈ సౌలభ్యాన్నికేంద్రం కల్పించింది.