ఏపీలో 23 శాతం, తెలంగాణలో 9 శాతం పాజిటివిటీ రేటు

భారత్‌లో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్రం నిర్దేశించిన ఐదు శాతం పరిమితి కంటే ఎక్కువగానే ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి ఏపీలో 23 శాతం పాజిటివిటీ రేటు ఉండగా, తెలంగాణలో 9 శాతంగా ఉంది.
పాజిటివిటీలో గోవా టాప్…
దేశంలో కరోనా పాజిటివిటీ రేటు గోవాలో అధికంగా ఉన్నట్లు పేర్కొంది. పాండిచ్చేరి, బెంగాల్, హర్యానా, కర్నాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48 శాతం ఉండగా, హర్యానాలో 37 శాతం ఉంది. హిమచల్, నాగాలాండ్‌లో పాజిటివిటీ రేటు కాస్త పెరుగుతోందని తెలిపింది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ సహా 18 రాష్ట్రాల్లో మాత్రం ఓ మాదిరిగా ఉందని తెలిపింది. బెంగళూరు అర్బన్, చెన్నై, మలప్పురం నగరాల్లో తీవ్రంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అలా అయితే లాక్‌డౌన్ అవసరమే : ఐసీఎంఆర్
కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్ అవసరమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే పాజిటివిటీ రేటు 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలను సడలించవచ్చని సూచించింది. ఢిల్లీలో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శతానికి తగ్గిందని ఐసీఎంఆర్ పేర్కొంది.