ప్రపంచంలోనే ఎత్తైన పర్వతానికి చేరిన కరోనా

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాన్ని కూడా కరోనా వైరస్ చేరుకున్నది. నేపాల్‍లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న నార్వే దేశానికి చెందిన ఎర్లెండ్ నెస్‍కు కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. దీంతో పర్వతంపై నున్న బేస్ క్యాంపు నుంచి అతడితో పాటు ఒక షెర్పాను హెలికాప్టర్‍లో కాఠ్మండులోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలో తమ ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఎర్లెండ్ నెస్ తెలిపారు. ప్రస్తుతం తనకు బాగానే ఉన్నదని చెప్పారు. ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మరెవరూ కరోనా బారిన పడకూడదని ఆశిస్తున్నట్లు నెస్ వెల్లడించారు. పర్వతాలపై గాలి పీల్చడం చాలా కష్టమని, అక్కడ కరోనా సోకితే పర్వతారోహకులకు చాలా ప్రమాదమని అన్నారు. అలాగే 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్నవారికి అక్కడి నుంచి హెలికాప్టర్‍లో ఆసుపత్రికి తరలించడం కూడా కష్టసాధ్యమని తెలిపారు.