థర్డ్ వేవ్ సమయంలో … లాక్ డౌన్ తప్పదు

భారత్‌లో కరోనా మూడో వేవ్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ హెచ్చరించారు. వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గరిష్ఠ స్థాయిలో ఉండనుందని అంచనా వేశారు. అదే సమయంలో పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ , ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మనీంద్రా అగర్వాల్ సూచించారు. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ సహజంగా ఉన్న ఇమ్యూనిటీని దాటడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్ కేవలం తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తుందని అన్నారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉండనున్నాయని వివరించారు. థర్డ్ వేవ్ సమయంలోనూ లాక్‌డౌన్ తప్పదని అన్నారు. ప్రభుత్వం చూపించే పనితీరును బట్టి దీని ప్రభావం కనిపిస్తుందని సూచించారు.