భారత్ లో సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందా?

భారత్‌తో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందా..? వారం రోజలుగా క్రమంగా తగ్గుతున్న కేసులు దేనికి సంకేతం.? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా తీవ్రత కొంచెం కొంచెం తగ్గుతోంది. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో రోజువారి తగ్గుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ దాదాపు 20వేల కేసులు తగ్గాయి. మరణాలు కూడా రెండు వందలు తగ్గడం కొంచెం ఊరట కలిగిస్తోంది. ఇండియాలో కొత్తగా మూడు లక్షల 26 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ దేశంలో మరో మూడు వేల 8వందల 83మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 36లక్షల 69వేల యాక్టివ్ కేసులున్నాయి.
సరిగ్గా 30 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా కోటి కేసులు, 90 వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ వేవ్‌లో ఇన్ని కేసులు రావడానికి 325 రోజులు, మరణాలు సంభవించడానికి 238 రోజులు పట్టాయి. కానీ.. సెకండ్ వేవ్‌లో మాత్రం… అంతకు పదిరెట్ల వేగంతో మహమ్మారి చుట్టుముడుతోంది. ఇప్పటివరకూ మొత్తం కేసుల్లో మరణాలు ఒకశాతం కాగా, ఈనెలలో నమోదైనవి పాయింట్ 88శాతంగా ఉన్నాయి. తొలిదశలో కనిపించని భయానక పరిస్థితి ఇప్పుడు అంతటా అలుముకొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సగటున 20 పాయింట్ 6శాతం పాజిటివిటీ రేటు నమోదవుతూ వస్తోంది. ఇంత భారీస్థాయిలో ప్రస్తుతం మరే దేశంలోనూ వైరస్ విస్తరించడం లేదు. ఏప్రిల్ ద్వితీయార్ధంతో పోల్చితే… మే తొలివారంలో 8పాయింట్ సున్నా ఏడు శాతం కేసులు, 49శాతం మరణాలు పెరిగాయి.
గత వారంలో వరుసగా మూడు రోజుల పాటు… 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ.. ఆ తర్వాత.. ఏకంగా లక్ష కేసులు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా అప్రకటిత లాక్‌డౌన్ అమలవుతోంది. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించుకోవడం ఫలితం ఇస్తోంది. స్వీయ నియంత్రణ వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందనే వాదన వినిపిస్తోంది. మరి ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తారో.. లేకుంటే గతంలోలాగా విచ్చలవిడిగా ఉల్లంఘించి థర్డ్ వేవ్ ను కొనితెచ్చుకుంటారో చూడాలి.