తగ్గుతున్న కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు

భారత్‍లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. మూడు లక్షలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినా.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 18,69,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,63,533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,329 మంది మృత్యువాతపడ్డారు. 4,22,436 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996 చేరింది. దేశంలో ఇప్పటివరకు 2,78,719 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 2,15,96,512 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 33,53,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో వైపు టీకా డ్రైవ్‍లో భాగంగా మొత్తం 18,44,53,149 డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.