భారత్ లో కరోనా కలకలం.. రికార్డు స్థాయిలో కేసులు

భారత్‍లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రెండు లక్షలకు పైగా కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరగా.. 1,73,123 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. రోజువారి కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్‍తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది. ఫిబ్రవరిలో 97 శాతానికి పెరిగిన రికవరీ రేటు, ఇప్పుడు 88.92 శాతానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీకా డ్రైవ్‍లో 11,44,93,238 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా, మొదటి స్థానంలో అమెరికా, మూడో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి.