భారత్ లో వచ్చే వారమే అందుబాటులోకి వ్యాక్సిన్ ?

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్‌ను అత్యంత త్వరలో దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసిది. ఇందులో భాగంగానే వచ్చే వారం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద కేంద్రం అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. టీకాపై అధికారులు కోరిన అదనపు సమాచారాన్ని తయారీ సంస్థలు ప్రభుత్వానికి అందించాయని, వచ్చే వారం అనుమతులు మంజూరయ్యే అవకాశముందని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపినట్లు పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, ఫైజర్ సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఫైజర్ టీకా ధర ఎక్కువగా ఉండటంతో పాటు దాన్ని భద్రపరిచేందుకు అతిశీతల ఉష్ణోగ్రతలు కావాల్సినందున కేంద్రం దాని వైపు మొగ్గుచూపట్లేదని తెలుస్తోంది. ఇక ఆస్ట్రాజెనెకా విషయానికొస్తే.. భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్/ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. దీని ధర తక్కువగా ఉండటంతో పాటు సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రతల్లో సుదీర్ఘకాలం భద్రపరిచే వీలుండటం, రవాణాకు అనుకూలంగా ఉండటంతో అనుమతులు మంజూరు చేసే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.