కోవిషీల్డ్ వేసుకున్న వారు రెండో డోస్ ఎప్పుడు వేసుకోవాలంటే….

కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలన్న నిపుణుల కమిటీ సిఫార్సులకు కేంద్రం ఓకే చెప్పింది. ఇది వరకు 28 రోజుల వ్యవధి ఉండేది. మరింత మెరుగైన ఫలితాల కోసమే ఈ వ్యవధిని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే కొవాగ్జిన్ డోసులో మాత్రం ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు 6 నెలల తర్వాత తీసుకోవాలని ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ స్పష్టం చేసింది. డెలివరీ తర్వాత తల్లులు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రకటించింది.
నిపుణుల సూచనలు ఇవీ….
కరోనా రోగులు కోలుకున్న 6 నెలల తర్వాత టీకాలు వేయాలని, ప్రస్తుతం కోలుకున్న రోగులకు 14 రోజుల తర్వాత మొదటి డోస్ ఇస్తున్నారని, 6 నెలల తర్వాత టీకా ఇస్తే శరీరంలో ఉత్పత్తి అయ్యే సహజమైన యాంటీబాడీల కార్యాచరణను పెంచే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అవసరం లేదు. ఇతర దీర్ఘకాలిక రోగుల కారణంగా ఆస్పత్రిలో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత టీకా ఇవ్వాలని, ప్రస్తుతం ఈ రోగులకు ప్రత్యేక ప్రోటోకాల్ లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.