మోడెర్నా టీకాకు అమెరికా గ్రీన్ సిగ్నల్

నోవెల్ కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికా ప్రభుత్వం మోడెర్నా టీకాకు అత్యవసర అనుమతి కల్పించింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‍డీఏ) ఇటీవలే ఫైజర్ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మోడెర్నా రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్‍కు ఎఫ్‍డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన ఓటింగ్‍లో మోడెర్నా టీకా వినియోగానికి 20 మంది అనుకూలంగా ఓటేశారు. ఒకరు ఓటింగ్‍లో పాల్గొనలేదు. ఎఫ్‍డీఏ కమిషనర్ స్టీఫెన్ హాన్.. మోడెర్నా టీకాకు ఆమోదం తెలిపారు. అయితే సోమవారం (ఈ నెల 21) నుంచి ఆ టీకాను దేశవ్యాప్తంగా డెలివరీ చేయనున్నారు. మోడెర్నా టీకాను కేవలం వయోజనులకు మాత్రమే ఇవ్వనున్నారు. టీనేజర్లపై నిర్వహించిన ట్రయల్స్కు సంబంధించిన పరిశోధనా డేటాను మోడెర్నా కంపెనీ ఇంకా బయటపెట్టలేదు. ప్రెగ్నెంట్, నర్సింగ్ మహిళలు, హెచ్‍ఐవీ లాంటి లక్షణాలు ఉన్నవారికి కూడా మోడెర్నా టీకాను ఇవ్వడం లేదు. మోడెర్నా మూడవ దశ ట్రయల్స్లో సుమారు 30 వేల మందికి టీకాను అందించారు. అయితే తాము ఇచ్చిన టీకా 94 శాతం సురక్షితంగా ఉన్నట్లు మోడెర్నా కంపెనీ ప్రకటించింది.