ఇలాగే ఉంటే… థర్డ్‌వేవ్ విరుచుకుపడటం ఖాయం : గులేరియా

కోవిడ్ నిబంధనల పాటింపులో ఏమాత్రం అలసత్వం వహించినా 6 లేదా 8 వారాల్లో థర్డ్‌వేవ్ విరుచుకుపడటం ఖాయమని ఏయిమ్స్ డైరెక్టర్ రాజ్‌దీప్ గులేరియా తీవ్రంగా హెచ్చరించారు. కోవిడ్ మార్గదర్శకాలను సక్రమంగా పాటించకపోయినా, గుంపులు గుంపులుగా గుమిగుడినా, థర్డ్ వేవ్ ఉవ్వెత్తున విరుచుకుపడటం ఖాయమని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ అత్యధిక భాగం పూర్తయ్యే వరకూ ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. ‘‘మొదటి వేవ్, రెండో వేవ్ విజృంభించినా, ప్రజలు అప్రమత్తమైనట్లు కనిపించడమే లేదు. మళ్లీ జనాలు గుంపులు గుంపులుగా కనిపిస్తూనే ఉన్నారు. ఇలాగే ఉంటే 6 నుంచి 8 వారాల్లో థర్డ్‌వేవ్ ముంచుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే మరికొన్ని వారాలు కూడా పట్టొ్చ్చు’’ అని గులేరియా ప్రకటించారు. హాట్ స్పాట్లలో తగిన నిఘా ఉండాల్సిందేనని గులేరియా అన్నారు.