కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ సిద్ధం…

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ లైన్‌లో పనిచేస్తున్న 3.7 లక్షల మంది వైద్య సిబ్బందిని గుర్తించింది. తొలి దశలో వీరికి వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేసింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ వచ్చే సంఖ్యను బట్టి తొలి విడతలో కానీ, రెండవ విడతలో కానీ ఇతర శాఖల ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించనున్నారు. ఫ్రంట్‌లైన్‌లో ఇతర శాఖల సిబ్బంది సంఖ్యను 12 లక్షలుగా గుర్తించింది.
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఫ్రంట్‌లైన్‌తో పాటు దీర్ఘకాలిక రోగులు, 50 ఏళ్లు దాటిన వారి సంఖ్యను కోటి మందిగా గుర్తించారు. అయితే వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సినేషన్ వేయాలంటే 4,5 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానుంది. కోటి మందికి వ్యాక్సిన్ వేయడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుచోట్ల రీజియన్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ఒకేసారి కోటీ డోసులు భద్రపరిచే విధంగా ఏపీలో ఏర్పాట్లు చేశారు. రెండు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల మధ్యలో వ్యాక్సిన్‌ను భద్రపరచనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మందికి ఒకేసారి వ్యాక్సిన్ వేయడానికి కూడా వైద్య, ఆరోగ్యశాఖ ఇబ్బంది లేదని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలో డ్రైరన్ విజయవంతంగా పూర్తయ్యింది. కోవిడ్ యాప్‌తో పాటు క్షేత్రస్థాయి సమస్యలని డ్రైరన్‌లో అధికారులు పరిశీలించారు. వ్యాక్సినేషన్ టీమ్‌లకి ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్ డోసులు ఆధారంగా ఎంతమందికి వ్యాక్సినేషన్ వేయాలనేది వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.