100రోజుల దిగువకు ఏపీలో కరోనా మరణాలు…
దేశంలోనే అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఆంధ్రప్రదేశ్ శరవేగంగా కోలుకుంటోంది. ఒక దశలో సగటున దాదాపు 10వేలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు 2000కేసుల కన్నా దిగువకు పడిపోయింది. అదే విధంగా మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. గత సోమవారం నాటికి చూస్తే 1916 కేసులు పాజిటివ్ గా నమోదవగా 13 మరణాలు సంభవించాయి. సరిగ్గా జులై 10వ తేదీన అంటే దాదాపు 110 రోజుల క్రితం ఇదే మరణాల సంఖ్య 15గా ఉండడం గమనార్హం. అలాగే జులై 12న 1933 కేసులు నమోదు కాగా దాదాపుగా అదే స్థాయిలో నవంబరు 2న 1916 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 8,27,882 కాగా మొత్తం మరణాలు 6719 కావడంతో… తనతో సమానంగా కేసులు నమోదైన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మరణాల సంఖ్య 0.81శాతంతో తక్కువగానే ఉండడం కూడా ఊరటనిచ్చే విషయమే. గత సోమవారానికి 22,538 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం 7,98,625 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 96శాతానికి చేరింది.
మొత్తం 60వేలకు పైగా కేసులతో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైన జిల్లాగా నిలిచిన నెల్లూరులో ప్రస్తుతం కేవలం 115 కేసులు మాత్రమే ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. అంతేకాకుండా అక్కడ రికవరి శాతం కూడా 98కి చేరింది. న ప్రస్తుతం పశ్చిమ గోదావరి (426), తూర్పు గోదావరి (354) గుంటూరు (179) జిల్లాల్లో రోజుకి 100కిపైగా కేసులు నమోదవుతున్నాయి. అన్నింటికన్నా మిన్నగా కర్నూలులో కేవలం 22కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ తగ్తుదల ఇలాగే కొనసాగుతుందని త్వరలోనే మరణాల సంఖ్య సున్నాకి చేరడం తధ్యమని అధికారులు థీమా వ్యక్తం చేస్తున్నారు. చలికాలం ప్రారంభం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా చలి తీవ్రత పెరగలేదు కాబట్టి అప్పుడే నిర్లక్ష్యం కూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






