గుడ్డ మాస్కులు సేఫ్ కాదు..! బీకేర్ ఫుల్!!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ కు మందు లేదు. చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఓ స్థాయి వరకే రక్షణ కల్పిస్తోంది కానీ పూర్తిస్థాయిలో కాదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు కూడా వైరస్ సోకుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం మాత్రమే కరోనా నుంచి కాపాడుకునేందుకు మార్గాలని చెప్తోంది. దీంతో ప్రజలు మాస్కులపైనే నమ్మకం పెట్టుకున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ లో వైరస్ ను అడ్డుకునేందుకు సాధారణ గుడ్డ మాస్కులు కూడా సరిపోతాయని.. ఖరీదైన ఎన్95 లాంటి మాస్కులు అవసరం లేదని నిపుణులు సూచించారు. దీంతో చాలా మంది సాధారణ మాస్కులనే వినియోగించారు. ఇప్పుడు కూడా చాలా మంది సాదారణ గుడ్డతో చేసిన మాస్కులనే వాడుతున్నారు. అయితే ఈ సెకండ్ వేవ్ లో కరోనాను ఈ గుడ్డ మాస్కులు అడ్డుకోలేవంటున్నారు నిపుణులు. అందుకే ఎన్95 లాంటి నాణ్యమైన మాస్కులు వాడాలని సూచిస్తున్నారు.
సెకండ్ వేవ్‌లో వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. కొంతమందయితే ఎక్కువ మంది ఉండే ఇళ్లలో.. పెద్దలు మాస్కులు ధరిస్తే మంచిదంటున్నారు. అంతేకాక.. సాధారణ మాస్క్ లు కాకుండా ఎన్95 లాంటివి వాడాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. ఒకే మాస్కును రోజుల తరబడి వాడొద్దని.. రోజు మార్చి రోజు ఒక్కో మాస్క్ వాడాలని సలహా ఇస్తున్నారు. రోజుల తరబడి ఒకే మాస్క్ వాడితో ఉపయోగం ఉండదంటున్నారు.
వైరస్ కౌంట్ ఎక్కువ ఉన్నవారు దగ్గినప్పుడో, తుమ్మినప్పుడో వైరస్ గాలిలోకి చొరబడుతోంది. అలాంటి వైరస్ ఒకటి, రెండు గంటలపాటు గాలిలో బతికే ఉంటున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఈ సమయంలో ఆ వైరస్ ఎవరికైనా సోకితే వాళ్లు కూడా కరోనా బారిన పడతారు. అందుకే మాస్కు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. పైగా సింగిల్ లేయర్, డబుల్ లేయర్ ఉన్న మాస్కులతో పోల్చితే మూడు లేయర్లు ఉన్న మాస్కుల నుంచి 90శాతం రక్షణ కలుగుతుందని చెప్తున్నారు. బయట దొరికే నాణ్యతలేని మాస్కులు ధరించినా ఉపయోగం ఉండట్లేదని.. అందుకే ఎన్95 లాంటి నాణ్యమైన మాస్కులు వాడాలని సూచిస్తున్నారు.