ఆటా ఆధ్వర్యంలో వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సదస్సు
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ అత్యవసరంగా మారిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ తెలంగాణకు వ్యర్థాల నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నీరు, వ్యర్థాల నిర్వహణ అంశంపై అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడుతూ తాను అటవీశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు చికాగో వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాలుష్య మహమ్మారిని తరిమికొట్టడానికి, నీటిసంరక్షణకు ప్రతి ఒక్కరూపాటుపడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నదని చెప్పారు.
వ్యర్థాల నియంత్రణలో సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఆట ఆధ్వర్యంలో తొలిసారి అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని కన్వీనర్ శ్యామ్ పప్పు తెలిపారు. అన్ని ప్రభుత్వశాఖలను భాగస్వామ్యం చేస్తూ సదస్సు నిర్వహిస్తున్నామని, ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింట్, కలుషిత నీటి నిర్వహణ, వరద నీటి నిర్వహణపై పలు దేశాలకు చెందిన ప్రముఖులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూఎస్‌లోని మెట్రోపాలిటన్ వాటర్ రీక్లెమినేషన్ డిస్ట్రిక్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఐఎల్ కమిషనర్ ఫ్రాంక్ అవిలా, ఐఏఎస్ కల్యాణ్ చక్రవర్తి, వెస్ట్‌జోనల్ కమిషనర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.













