డిస్నీ వరల్డ్ లో 43 వేల మందికి బలవంతపు సెలవు
కరోనా సాకుతో వాల్ట్ డిస్నీ వరల్డ్ తమ సంస్థలోని ఉద్యోగులను బలవంతపు సెలవుపై పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వేతనరహితమైన ఈ సెలవు దాదాపు ఒక ఏడాది పాటు కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ విస్తృతితో డిస్నీ థీమ్పార్క్ మార్చి మధ్య నుండి మూతపడిన విషయం తెలిసిందే. ఈ సెలవు కాలంలో ఉద్యోగులు తమ ఆరోగ్య, జీవిత, బీమా సౌకర్యాలను యధాతథంగా అందుకుంటారు. సీనియారిటీ, వేతనాల్లో కూడా ఎలాంటి మార్పూ వుండదని యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్న కార్మిక సంఘాల సమాఖ్య సర్వీస్ ట్రేడ్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 నుండి ప్రారంభమయ్యే ఈ సెలవు కాలంలో దాదాపు 200 మంది ఉద్యోగులు మాత్రం తమ సీనియార్టీ ఆధారంగా అత్యవసర విధులను నిర్వహిస్తారని కౌన్సిల్ తన ప్రకటనలో వివరించింది.
డిస్నీ ప్రత్యర్థి సంస్థలయిన యూనివర్సల్ ఆర్లాండో, సీ వరల్డ్ ఆర్లాండో ఇప్పటికే మూతపడ్డాయి. సీ వరల్డ్ సంస్థ తన ఉద్యోగుల్లో 90 శాతం మందిని బలవంతపు సెలవుపై పంపినట్టు చెబుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో అమెరికా వ్యాప్తంగా కార్మిక, ఉద్యోగుల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. దేశవ్యాప్తంగా 66 లక్షల మంది నిరుద్యోగభృతికి దరఖాస్తు చేసుకున్నారని అమెరికా కార్మిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంటే దేశవ్యాప్తంగా వున్న శ్రామిక వర్గంలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నమాట.













