దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు రద్దు :అమెరికా
దక్షిణ కొరియాతో కలిసి ఆగస్టులో జరపనున్న ఉమ్మడి సైనిక విన్యాసాలను రద్దు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖ ప్రతినిధి డాన్ వైట్ మీడియాతో మాట్లాడుతూ కొరియాతో ఇటీవల ట్రంప్ జరిపిన సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత వారంలో డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డిపిఆర్కె) నేత కిమ్ జాంగ్ ఉన్‌తో సింగపూర్‌లో చారిత్రాత్మక సమావేశం జరిగిన తరువాత దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని అమెరికా నిలిపివేస్తుందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తామింకా అదనపు చర్యలను సమన్వయం చేస్తున్నామని, తరువాత వారితో సైనిక విన్యాసాలపై నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ వారాంతాన పెంటగాన్‌లో సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టీస్, సహాయ మంత్రి మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ హాజరవుతారని ఆమె తెలిపారు.













