అమెరికాలో లక్ష మంది మరణించే ప్రమాదం : డొనాల్డ్ ట్రంప్
కరోనాతో దాదాపు లక్షమంది వరకు మృత్యువాతపడొచ్చని, రాబోయే రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరుగనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు నిర్ణీత దూరం పాటించేలా ఏప్రిల్ 30 వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజారోగ్య సలహాదారులు, వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ చర్యలు చేపట్టకపోతే భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నదని వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.ఈస్టర్ పర్వదినానికల్లా అంతా సర్దుకుంటుందని అంతకుముందు పేర్కొన్న ఆయన తాజాగా మాటమార్చారు. జూన్ 1వ తేదీనాటికి పరిస్థితులు చక్కబడుతాయని పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 1,43,000 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. 2,500 మందికిపైగా మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 13,000 కరోనా కేసులు నమోదు కాగా, 160 మంది మరణించారు.













