హెచ్ 1బీ నిబంధనలతో అమెరికాకే ఎక్కువ నష్టం
హెచ్ 1 బీ వీసా నూతన నిబంధనల వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుందని భారత సంతతికి చెందిన అమెరికన్ సెనేటర్లు భావిస్తున్నారు. ఐటీకి అమెరికా పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నదని, నూతన నిబంధనల వల్ల ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడతుందని చెప్తున్నారు. అంతేగాక భారత్, అమెరికా మధ్య సంబంధాలపై కూడా ఈ ప్రభావం పడనుందని పేర్కొంటున్నారు. ప్రతిభావంతులైన ఐటీ ఉద్యోగులను అమెరికాలో కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ హెచ్ 1బీ వీసా నూతన నిబంధనలు దాదాపు 5 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపనున్నాయి. వారంతా అమెరికా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే వారంతా స్వదేశానికి వెళ్లిపోతారు. దీంతో అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని పేర్కొన్నారు. చట్టసభ సభ్యుడో రో ఖన్నా మాట్లాడుతూ హెచ్ 1బీ వీసా నూతన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు.













